నిత్య నవ్వింది

Venu Vedam
Venu Vedam's Blog
Published in
3 min readJan 17, 2023

--

సాయంత్రపు నీరెండ చెట్ల మధ్యలో నుండి వెచ్చగా స్పృశిస్తూ ఉంది. పడమటి పిల్ల గాలి నేను సైతం అంటూ అంటీ అంటనట్టు ఆ ఎండ కి సవాలు విసురుతూ ఉంది.

ఆయాసం ఎక్కువై సైకిల్ ఆపాను. అప్పటికే అయిదు కిలోమీటర్లు వచ్చాను. ఇంకో వంద గజాల్లో గమ్యం చేరుకోవచ్చు. చెమటతో ఒళ్లంతా తడిసిపోయింది. నీళ్ళ బాటిల్ లోఅడుగంటి ఉన్న ఆఖరి గుక్కడు నీళ్ళని గొంతులోకి ఒంపుకున్నాను.

“ఎందుకురా సైకిల్ లో వస్తావు? హాయిగా ఒక బైక్ కొనుక్కోవచ్చు కదా?” అంటారు అందరూ. నేను నవ్వి ఊరుకుంటాను. సైకిల్ లో ప్రయాణించడం నా దైనందిక జీవితం లో నేను ఆశగా ఎదురుచూసే ఏకైక ఘట్టం. అలాగని నేనేదో అన్నీ వదిలేసిన సన్యాసిననుకోకండి. ఒక ప్రైవేటు కంపెనీ లో మంచి ఉద్యోగమే వెలగబెడుతున్నాను. నెలసరి జీతం ఇరవైవేలకి పైబడే. బైక్ కొనుక్కోవడం ఏమంత కష్టతరం కాదు. కాని ఇష్టం లేదు. ఇప్పటికే సుందర్బన్లు నీళ్ళలోకి వెళ్లిపోతున్నాయంట. ఇంకొన్ని రోజులు పోతే మా కాకినాడ మునిగిపోయినా ఆశ్చర్య పడాల్సిన పని లేదు. ఇంటి ముందు వసారాలో ప్రశాంతంగా కూర్చొని ప్రపంచం వేడెక్కిపోతూ ఉంది అని చర్చించడం కంటే, “నేను నా వంతు సాయం, పుడమి చల్లబడటానికి చేస్తాను” అని ప్రతి ఒక్కరూ నడుము బిగిస్తే, జలప్రళయం లో సుందర్బన్లు మునిగినా, మిగతావి జలప్రాయం కాకుండా కాపాడుకోవచ్చు.

ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలండోయ్… నాణానికోవైపు కర్బన పిశాచి ఉంటే, ఇంకో వైపు కొవ్వు పదార్ధం ఉంది…. అదేనండి రక్త నాళాల్లో చేరుకునేవి. సైకిల్ వల్ల ఒకే దెబ్బకి రెండు పిట్టలన్న మాట.

నా ఈ సిద్ధాంతాన్ని తుంగలో తొక్కను, నా అనుంగు మిత్రుడేతెంచెన్ ఒక సొగసరి బైక్ మీద. బాటలో ఉన్న బావి లాంటి అడుసు లోంచి రయ్యిమంటూ వెళ్ళే ప్రక్రియ లో ఆ అడుసు పక్కన ఉన్న అభాగ్యుని గురించి ఒక్క క్షణమైనా యోచించెనా అతండు?సరే అది అటుంచుము. ఈ అభాగ్యునికి ఆ సమయమునే ఆయాసము రావలెనా? అది కూడా పక్కన పెట్టుము… “అడుసు తొక్కనేల, కాళ్ళు కడగనేల” అన్న సూక్తిని ఎన్నో సార్లు నొక్కి వక్కాణించిన ఆ సదరు అభాగ్యునికి ఆ మాత్రం తట్టలేదా? “అడుసు పక్కనుండనేల, బురదంటెనని చింతించనేల”

తన ఘన కార్యము తెలిసివచ్చి, మరింత హుషారు గా వెళ్ళిపోయిన ఆ ఒకప్పటి మిత్రుడు గురించి మరెప్పుడన్నామాట్లాడుకుందాం. స్నేహితుడి పై బురదజల్లేవాడిని “గ్రక్కున విడువంగవలయు కదరా సుమతి” అన్నారు వేణు వేదం గారు. (అది నేనేనండి. మీరు కంగారు పడకండి.)

తెల్లని చొక్కాపై నల్లని మరకలు చూసి బాధపడుతున్న ఆ తరుణంలో వినిపించింది ఆ కిలకిలారావం.

మలయమారుతంలా తాకింది ఆ సొగసరి మందహాసం.

తల ఎత్తి చూసాను. టక్కున ప్రేమలో పీకల దాకా కూరుకుపోయాను.

మొదటి చూపు లో ప్రేమేంటి అని దబాయించేవాడిని ఇన్ని రోజులు. ఇప్పుడు మొదటి చూపులో అసలు ఈ ప్రేమేంటి అని ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.

ముత్యాల్లాంటి పల్వరస, కోటేరు లాంటి ముక్కు… ఆగండి. అక్కడే ఆగిపోండి. యద్దనపూడి నవలలో కథానాయిక వివరణ గుర్తుకు తెచ్చుకోండి చాలు.

ఇంతటి అందం మా ఇంటి ఎదురింట్లో ఎప్పటి నుండి ఉంది?

ఇన్ని రోజులు నేను ఎందుకు గమనించలేదు?

ఈ ఆత్మావలోకనం అంతులేకుండా కొనసాగుతుండగా, ఆ అమ్మాయికి హఠాత్తుగా ఈ అబ్బాయి ఏమన్నా బాధ పడ్డాడేమోనని కించిత్ ఆందోళన కలిగి “సారీ” అన్నట్లు పెదాలు కదిపి తుర్రుమంటూ ఇంటిలోపలికి వెళ్ళిపోయింది.

ఈ తతంగం అంతా కళ్ళప్పగించి చూస్తున్న పక్కింటి వనజాక్షి గేటు దగ్గరకి వచ్చి “బాబు ఓ సారి ఇట్రా” అని పిలిచింది.

వామ్మో ఈవిడ కన్ను నా మీద పడిందేంటి అనుకుంటూ వెళ్లాను. “హలో ఆంటీ. బాగున్నారా?”

“ఆ ఆ బాగానే ఉన్నాలే. ఆ అమ్మాయి గురించి తెలుసా నీకు?”

ఆవులిస్తే పేగులు లెక్కపెట్టడం అంటే ఏంటో అప్పుడే అర్థం అయ్యింది నాకు. “తెలీదండి. అయినా నాకు సంబంధించిన విషయం కాదు కదండీ. నేను వెళ్ళొస్తా.” అని అక్కడ నుండి జారుకోబోయాను.

“ఉండబ్బీ.. నీ వాలకం చూస్తూనే ఉన్నాలే. మళ్ళీ ఎక్కడ చెప్పలేకపోతానో అని చెప్పేస్తున్నా.. నీ మంచి కోసమే. ఎంతైనా మా వాడివి కదా.”

ఓర్నీ, ఇది కులపిచ్చి భాగోతమా… “అది కాదు ఆంటీ.. నాకు అది పెద్ద ప్రాబ్లం కాదు” అన్నాను.

ఆవిడ నావంక నిదానంగా చూసి నిట్టూర్చింది. నేను ఆవిడను నొప్పించకుండా ఆ సమావేశాన్ని ఎలా ముగించాలో బేరీజు వేసుకుంటున్నాను. అప్పుడు పేలింది ఆ తూటా.

“నిత్య మూగది బాబు.”

ఒక శీతల పావనం నన్నుఅలవోకగా స్పృశించింది. గుండె బరువెక్కింది. అది జాలి వలనా లేక నిరాశ వలనా అన్నది నాకు తెలియలేదు. ప్రపంచం మాత్రం ముందు లాగా లేదని ఘంటాపదంగా చెప్పగలను.

“బాబు, కూర్చుంటావా? నీళ్లేమైనా కావాలా?” ఆవిడ గొంతులో జాలి ధ్వనించింది. చిటికెడు గర్వంతో కూడిన చిరునవ్వు బయటపడటానికి విశ్వప్రయత్నం చేసింది.

సమాధానం చెప్పి సంభాషణ సాగదీయడం ఇష్టం లేక సాయంత్రపు నీరెండ నీడల్లో దాక్కుని ఆ సందు నుండి నిష్క్రమిద్దామని వడి వాడిగా నడవబోయాను. కానీ అడుగు ముందుకి పడలేదు.

గేట్ దగ్గర నిత్య. నన్నే చూస్తూ ఉంది. హలో అన్నట్లు చేయి ఆడించాను.

“నిత్య మూగది బాబు. చెవులు బాగానే వినపడతాయి.” వెనకాల నుండి వనజాక్షి గారి లౌడ్ స్పీకర్ గొంతు ఘోషించింది.

నాలుక కరుచుకొని, “హలో, బాగున్నారా?” అన్నాను.

తన చిరునవ్వు — నన్ను వివశుడిని చేస్తూ ఉంది. తల ఊపిందో లేక మనసులు చేరి మాట్లాడుకున్నాయో తెలియదు కానీ “బాగున్నాను. మీరు?” అని నిత్య “అనడం” నాకు వనజాక్షి గారి వాక్కు కన్నా స్పష్టంగా “వినపడింది”.

అప్పటి వరకు నా మనసుని అతలాకుతలం (తెలుగు న్యూస్ ఛానళ్ళు చాలా చూస్తానులెండి) చేసిన తుఫాను, బంగాళాఖాతంలో “కాసేపు ప్రదర్శన” ఇచ్చి బలహీన పడే వాయుగుండంలా, సమసిపోయింది. గుండె మీద బరువు ఆనందానికి చోటిచ్చి వెళ్ళిపోయింది. తన కళ్ళలోని నా రూపం, ఇది నా వెయ్యిన్నొక్క వన్-సైడెడ్ ప్రేమాయణం ఎపిసోడ్ కానే కాదని చాటి చెపుతూంది.

ప్రశాంతంగా ముందుకు సాగాను ఒక నిర్ణయానికి వచ్చి. తాను నా ఆంతర్యం గ్రహించినట్లుంది. చిన్నగా పెదవులు అంటీఅంటనట్లు నిత్య నవ్వింది.

వనజాక్షి గారి మొఖంలో మెప్పు కనపడింది.

సమాప్తం.

--

--